- హాక్ ఐ, పోలీస్ కాప్ యాప్స్హ్యాక్
- డార్క్ వెబ్‌లో సిటిజన్ల డేటాను అమ్మకానికి పెట్టిన హ్యాకర్లు
- దాదాపు 2 లక్షల మంది డేటా చోరీ
- 120 డాలర్లకు అమ్మేస్తున్నట్లు ఎక్స్‌లో పోస్టులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర పోలీస్ యాప్స్ హ్యాక్అయ్యాయి. దాదాపు 2 లక్ష మంది సిటిజన్ల డేటాను సైబర్ నేరగాళ్లు డార్క్ వెబ్‌లో అమ్మకానికి పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. 120 డాలర్లకు టీఎస్ పోలీస్ డేటాను విక్రయిస్తున్నట్లు ఎక్స్(ట్విట్టర్)లో పోస్టింగ్స్కూడా పెట్టారని తెలుసుకున్నారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న సైబర్ సెక్యూరిటీ బ్యూరో దర్యాప్తును ముమ్మరం చేసింది. హ్యాకర్లకు సంబంధించిన డేటాను సేకరిస్తోంది.
తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్కు చెందిన సోషల్ యాప్స్‘హ్యాక్ ఐ’, ‘టీఎస్ పోలీస్ కాప్’ సహా పలు వెబ్‌సైట్లను సైబర్‌నేరగాళ్లు హ్యాక్ చేశారని గుర్తించిన ఐటీ సెల్ డీఎస్పీ రవిచంద్ర ఫిర్యాదుతో సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు కేసు నమోదు చేశారు. 2018లో స్టేట్పోలీస్ డిపార్ట్మెంట్కు సంబంధించి ‘టీఎస్ కాప్’ యాప్ రూపొందించారు. దీని ద్వారా ‘హాక్ ఐ’ సహా 54 సేవలకు సంబంధించిన యాప్స్‌ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు.
అలాగే ఆన్‌లైన్‌లో అనేక వెబ్‌సైట్లతో సేవలు అందిస్తున్నారు. ఇందులో ‘హాక్ ఐ’ యాప్ సహా పలు వెబ్‌సైట్లు హ్యాక్ అయినట్లు రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో గుర్తించింది. ‘టీఎస్ కాప్’ యాప్‌ను కూడా హ్యాక్ చేసినట్లు సైబర్ నేరగాళ్లు సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఫేస్ మిర్రరింగ్ యాప్, ఏసీబీ, సీఐడీ సహా పోలీస్ డిపార్ట్మెంట్లోని కీలక విభాగాలకు చెందిన డేటాను విక్రయిస్తున్నామని అందులో చెబుతున్నారు.